Monday 28 January 2013

నిజంగా నేను చింతిస్తున్నాను!


మన దేశపు ఒకప్పటి "హోమ్" శాఖా మంత్రికి స్వంత ఇల్లు లేదు. అంబాసిడర్ కారు కొనుక్కోడానికి ఆయన బ్యాంకు లోన్ తీసుకున్నారు. ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు తన మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. ఆయన పేరు లాల్ బహదూర్ శాస్త్రి.

అలాంటి మహోన్నత వ్యక్తిత్వం ముందు ఇప్పుడున్న రాజకీయ నాయకులు, మంత్రులు, సీఎమ్‌లు, పీఎమ్‌లు, ప్రెసిడెంట్లు, గవర్నర్లు ఏపాటి? జస్ట్ పిపీలికామాత్రులు! అంతే..

కట్ చేస్తే -  

ఎన్నడో బ్రిటిష్ పాలన నాటి ప్రెసిడెంట్, గవర్నర్ గిరీలు ఇప్పుడు నిజంగా అవసరమా? తాము తిరగాలనుకున్న దేశాలు తిరగడానికి, వారానికో పది రోజులకో ఏదయినా ఒక ప్రారంభోత్సవం చేయడానికి, రిబ్బన్ కట్ చేయడానికి తప్ప - ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో వీరి అవసరం నిజంగా ఉందా? కేవలం కోట్లకొద్దీ ధనం వృధా చేయటం తప్ప!

ఈ విషయంలో - ఇటీవలి కాలంలో - ఒకే ఒక్క ఎక్సెప్షన్ గురించి ఇక్కడ నేను ఒప్పుకోక తప్పదు. అతని పేరు అబ్దుల్ కలాం. తాను ప్రెసిడెంట్ పదవిలో ఉన్నన్నాళ్లు ఆ పదవికే నిజంగా ఒక అర్థం, పరమార్థం తీసుకురాగలిగాడు.

ప్రజా ధనం వృధా అనగానే గుర్తొచ్చింది...

మొన్నటి వరకూ మన  ప్రెసిడెంటుగా ఉన్న ప్రతిభా పాటిల్ ఆ పదవిలో ఉన్నన్నాళ్లు ఏం చేసిందో నిజంగా నాకు తెలియదు. లెక్క లేనన్ని దేశాలు తిరిగింది. ఇక, తన పదవీ విరమణ చివరి రోజుల్లో అయితే మరింత గొప్ప రికార్డు క్రియేట్ చేసింది. సేషల్స్, సౌత్ ఆఫ్రికాల్లో ఒక 9 రోజులు పర్యటించింది. ఆ పర్యటన దేని గురించో, ఫలితం ఏంటో నాకు తెలియదు. ఆ వివరాల్ని ఏ న్యూస్ పేపర్ గానీ, టీవీ చానెల్ గానీ కవర్ చేయలేదు. చేసుంటే మాత్రం - పాలిటిక్స్ గురించి అతి తక్కువగానయినా ఆసక్తి చూపే నాలాంటి వాళ్ల దృష్టికి కొంతయినా వచ్చేది. అయితే, ఈ పర్యటనకు సంబంధించి అద్భుతమయిన న్యూస్ ఒకటి మాత్రం నేను చదివాను. దాన్నే ఈ సందర్భంగా మీతో పంచుకోవాలనిపిస్తోంది.

ప్రతిభా పాటిల్ 9 రోజుల సేషల్స్, సౌత్ ఆఫ్రికా పర్యటనకి అయిన ఖర్చు అక్షరాలా 16.6 కోట్లు! ఆ మొత్తంతో కనీసం ఒక పెద్ద ఫాక్టరీని స్థాపించి, ఓ వెయ్యి మందికి ఉపాధి కల్పించవచ్చు. కాదా?

ఇదిగో ఇలాంటి వార్తలే నన్ను అమితంగా కలచివేస్తుంటాయి. ఏదో ఒకటి నా భావాల్ని ఇలా బ్లాగ్ రూపంలో పంచుకోవాలనిపిస్తుంది. కానీ, ఈ బ్లాగ్ లో పాలిటిక్స్‌ని చర్చించటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. పాలిటిక్స్ అంటేనే నాకు పడదు. అయినా, ఇంతకు ముందు "రాజరికం 2013" పేరుతో ఒక బ్లాగ్ పోస్టు రాశాను. ఇప్పుడు ఇది రాస్తున్నాను. ఈ రెండు పోస్టులు రాసినందుకు నిజంగా నేను చింతిస్తున్నాను. ఇక ముందు మాత్రం ఈ పొరపాటు చేయను.

ఆల్రెడీ సినీఫీల్డులో దిగిపోయి, ఇక్కడే పీక్కోలేక చస్తున్నాను. ఇంక పాలిటిక్స్ బురద కూడానా! ఓ... నో!!!



No comments:

Post a Comment