Sunday 30 June 2013

అంతా ఏమనుకుంటారో!

ఈ ఒక్క వాక్యం.. ఈ ఒక్క ఆలోచన.. ఈ ఒక్క మూర్ఖపు సందిగ్ధత - ఈ భూమ్మీద ఎన్నో వేల లక్షల జీవితాలు 'బ్రతుకు'లుగా మారిపోడానికి కారణమౌతుందంటే నమ్మగలరా? నమ్మాలి. నిజం కాబట్టి.

వృత్తి కావొచ్చు, వ్యక్తిగతం కావొచ్చు.. కష్టమైనా, ఇష్టంగా మనం కోరుకున్నట్టు ప్రయాణం సాగించేది జీవితం. ఎవరో ఏదో అనుకుంటారని ఎక్కడికక్కడ రాజీపడిపోతూ లాగించేది బ్రతుకు.

నేను చెప్పను. స్టేట్‌మెంట్లివ్వను. ఎవరికివారే ఒక అరవై సెకన్లపాటు ఆలోచిస్తే చాలు. మనతోసహా, మన చుట్టూ ఉన్న ప్రతి వందమందిలో ఎంతమంది నిజంగా జీవిస్తున్నారు? ఎంతమంది జీవిస్తున్నామన్న మాస్క్ వేసుకొని బ్రతుకు లాగిస్తున్నారు?

మనకో పదిమంది స్నేహితులు, వందమంది బంధుగణం ఉండొచ్చు. ఫేస్‌బుక్‌లో ఓ అయిదువేలమంది, ట్విట్టర్లో వెయ్యిమంది, బ్లాగ్‌లో ఇంకో రెండువేలమంది.. మన నెట్‌వర్క్‌లో ఉండొచ్చు. మన ఇంటి పక్కవాళ్లు, పైనవాళ్లు, కాలనీవాళ్లు.. మరో వందమంది ఉండొచ్చు.

వీళ్లంతా ఏమనుకుంటారో అని మీరు చేయాలనుకుంటున్నది, చిన్నదయినా పెద్దదయినా, దాన్ని చేయకుండా  ఆపకండి. తొక్కిపెట్టకండి. మహా అయితే ఫెయిలవుతారు. అంతేగా? దాన్ని పట్టించుకునే తీరికలు ఎవరికీ లేవు. ఎవరి గొడవలు వారికున్నాయి. ఎవరి సందిగ్ధతలు వారికున్నాయి. ఎవరి జీవితాలు, బ్రతుకులు వారికున్నాయి.

కనీసం ఈ ఒక్కరోజయినా - మీరు ఎప్పటినుంచో అనుకుంటూ, ఎవరో ఏదో అనుకుంటారని దాటవేస్తూవస్తున్న ఏదయినా ఒక చిన్న పనిని వెంటనే చేసెయ్యండి.

అది ఎవరినయినా కలవటం కావొచ్చు. ఎవరికయినా కాల్ చెయ్యటం కావొచ్చు. ఒక ఈమెయిల్ పెట్టటం కావొచ్చు. ఒక బ్లాగ్ రాయటం కావొచ్చు. మీరెప్పట్నుంచో వాయిదా వేస్తూ వస్తున్న ఒక నవల రాయటం ప్రారంభించటం కావొచ్చు. మీకిష్టమయిన ఒక చిన్న వస్తువు ఏదయినా కొనటం కావొచ్చు. సింపుల్‌గా ఒక "నో" చెప్పటం కావొచ్చు. మీ ఫ్రెండుకో, జీవిత భాగస్వామికో ఒక "సారీ" చెప్పటం కావొచ్చు. ఇంకేదయినా చెప్పటం కావొచ్చు. వెంటనే ఆ పని చేసెయ్యండి.

ఈ ఒక్క చిన్న స్టెప్ మీరు వేయగలిగితే చాలు. రేపు మరో స్టెప్ ఈజీగా వేయగలుగుతారు. ఆ తర్వాత ఇంకో స్టెప్. అదే జీవితం. వేలు, లక్షలు అన్నే ఆ తర్వాతే.. అవే వస్తాయి.

పీ ఎస్:
అంతా ఏమనుకుంటారో అని నేనూ గత కొద్దిరోజులుగా వాయిదావేస్తూ వచ్చిన ఒక 
చిన్నవెబ్‌సైట్‌ని, వీబ్లీలో ఫ్రీగా అప్పటికప్పుడు రెండు గంటల్లో  క్రియేట్ చేశాను. దాన్ని నా బ్లాగ్‌కి తగిలించేశాను కూడా. ఆ తర్వాతే ఈ బ్లాగ్ రాశాను! :)  

1 comment:

  1. ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకున్న పనిని వాయిదా వేయడం తగదు!జీవితం ఎంతో చిన్నది!

    ReplyDelete