Saturday 6 July 2013

మీ అసలు లక్కీ నంబర్ మీకు తెలుసా? - 2

రోజుకి మనకున్న 24 గంటల్లో ఒక 8 గంటలు నిద్రకు సరిపోతుంది. ఇంకో 8 గంటలు మన వ్యక్తిగత జీవితం, మన దైనందిన వ్యక్తిగత వ్యవహారాలకీ, వేస్ట్ వ్యవహారాలకీ సరిపోతుంది. ఈ 16 గంటల సమయాన్ని మినహాయిస్తే - ప్రతిరోజూ మనం పని చేసే సమయం సగటున 8 గంటలు అన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే, నిజానికి ఆ 8 గంటలు కూడా మనం మనసుపెట్టి పనిచేయం అన్నది మనం ఒప్పుకోడానికి ఇష్టపడని నిజం!

శాస్త్రీయ అధ్యయనం ప్రకారం - ప్రతి 3 పనిగంటల్లో కేవలం ఒక గంట మాత్రమే మనం పనిచేసేది! చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో, ఎన్నో ప్రయివేట్ ఆఫీసుల్లో, సొంత వ్యాపారాల్లో, వృత్తుల్లో.. చాలా మంది ఆ గంటసేపు కూడా పనిచేయరనుకోండి. అది వేరే విషయం.

ఫార్చూన్ 500 కంపెనీల 'సీ.ఈ.ఓ' లే రోజుకి కేవలం 28 నిమిషాలపాటు మాత్రమే పనిచేస్తారట. దీన్నిబట్టి మనవాళ్లెంత సమయం పనిచేస్తారో ఊహించవచ్చు. మరి మిగిలిన సమయం అంతా ఏమయిపోతోంది అంటే - విష్ చేసుకోడాలు, కుశల ప్రశ్నలు, గాసిప్స్, పాలిటిక్స్, చాయ్‌లు, సిగరెట్లు, పనిచేయడానికి 'మూడ్' తెచ్చుకోడం, లంచ్, స్నాక్స్, పర్సనల్ పనులు, క్రికెట్, ఫోన్ కాల్స్, ఫేస్‌బుక్, చాటింగ్ వగైరాలకే సరిపోతుందన్నమాట.

కట్ టూ మన లక్కీ నంబర్ -

ఒక కేలండర్ యియర్లో - లేదా వచ్చే 365 రోజుల్లో - మీరు నిజంగా ఎంత సంపాదించాలనుకుంటున్నారు? ఊరికే, రఫ్‌గా ఒక 5 లక్షలు అనుకుందామా? డన్.

వీకెండ్స్, సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్ (ఉంటే), పండగలు, పబ్బాలు, లీవులు, ఎగ్గొట్టడాలు.. ఇవన్నీ మైనస్ చేస్తే - సగటున ఒక సంవత్సరంలో 220 మాత్రమే పనిదినాలుంటాయి. మీరు లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల్ని ఈ 220 రోజుల్లోనే పనిచేసి సంపాదించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మీ ప్రతీ పనిదినం (వర్కింగ్ డే) విలువ 2,273 రూపాయలు. దీన్ని 8 గంటలతో భాగిస్తే - గంటకి సుమారు 284 రూపాయలు అవుతుంది.

కాని, ముందు మనం అనుకున్న విధంగా - సగటున, మనం పనిచేసే 8 గంటల్లో కేవలం 1/3 భాగం మాత్రమే మనం పనిచేస్తాం. కాబట్టి ఈ 284 రూపాయల్ని 3 చేత హెచ్చవేయాల్సి ఉంటుంది. అంటే, 284 x 3 = 852 రూపాయలు. దీన్ని 60 చేత భాగిస్తే వచ్చేదే మీ అసలు అదృష్ట సంఖ్య.

842 ని 60 చేత భాగిస్తే 14 వస్తుంది. అంటే మీ ప్రతి పని నిమిషం విలువ 14 రూపాయలు!

1 నుంచి 9 లక్కీ నంబర్ల విషయం నాకు తెలీదు. కానీ - ప్రాక్టికల్ గా ప్రతి నిమిషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మీ జీవితాన్ని అభివృధ్ధిపథంలోకి తీసుకెళ్లే మీ అసలు లక్కీ నంబర్ మాత్రం ఇదే.

ఇది తెలిస్తే - మీ జాతకం ఏంటో మీకే తెలుస్తుంది. ఇప్పటివరకు మీ జీవితంలో ఏం జరిగిందో తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుస్తుంది. ఇకముందు ఏం జరగబోతోందో తెలుసుకుంటారు. ఇంకా చెప్పాలంటే - మీ జీవనశైలి, మీ ఆలోచనా విధానం.. అన్నీ మీరు ఊహించని విధంగా మారిపోతాయి.

ఒక్కసారిగా మీ నిర్ణయాలు మారిపోతాయి. మీరు కలిసి కబుర్లు చెప్పే వ్యక్తులు మారిపోతారు. మీరు సెల్ ఫోన్లో మాట్లాడే ప్రతి కాల్ అసలు విలువ తెల్సిపోతుంది. ఇంకా ఎన్నో నిజాలు మీరే కనుక్కుంటారు.      

ఇకనుంచీ, మీ లక్కీ నంబర్ విలువకు సరిపోని పనులను మీరు చేపట్టరు. అంత విలువైన పనులు మీకు లభించాలంటే ఏం చేయాలో మీరు ఆలోచిస్తారు. లేదా, అంత విలువైన పనుల్ని మీరే క్రియేట్ చేసుకుంటారు. లక్ష్యం మీదే మీ దృష్టి ఫోకస్ అవుతుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. అనుకున్నంత సంపాదిస్తారు.

మీ లక్ష్యాలను బట్టి ప్రతి సంవత్సరం, లేదా ప్రతి నెలా మీ లక్కీ నంబర్ ను మీరే మార్చుకోవచ్చని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను.

ఈ సంవత్సరానికి నా అసలు లక్కీ నంబర్ 280. ఇప్పుడు చెప్పండి.. మీ అసలు లక్కీ నంబర్ ఎంత?

నిజానికి ఈ లక్కీ నంబర్ మన డబ్బు సంపాదనకు సంబంధించింది మాత్రమే అనుకుంటే పొరపాటే అవుతుంది. మన చేతుల్లోంచి జారిపోతున్న మన సమయం అసలు విలువ తెలిసినప్పుడే మనం ఏదయినా సీరియస్‌గా తీసుకోగలుగుతాం. ఏదయినా సాధించగలుగుతాం.

దీన్ని మించిన టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్, పర్సనల్ డెవలప్‌మెంట్ సీక్రెట్ ఏదీ లేదు. జీవితంలోని అన్ని సీక్రెట్లూ దీనిచుట్టూనే గిరగిరా తిరుగుతుంటాయి. ఈ నిజాన్ని మీరూ ఒప్పుకుంటారనుకుంటాను.      

No comments:

Post a Comment