Monday 12 August 2013

2014 ప్రధానితో మన టాలీవుడ్!

మన తెలుగు ఇండస్ట్రీలో ఒక సాంప్రదాయం ఉంది ..

రాష్ట్రంలో ప్రభుత్వం ఏది మారినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా - పుష్పగుచ్చాలు, శాలువాలతో మొత్తం టాలీవుడ్ కదిలివెళ్తుంది. అభినందిస్తుంది. 'వాళ్లంతా కూడా కొంపదీసి అదే పార్టీనా' అన్నంత అభిమానాన్ని కురిపించి మరీ అభినందనలు తెలుపుతారు. మనవాళ్లకు ఇదొక ఆనవాయితీ అయింది.

పాజిటివ్ కోణంలో  ఆలోచిస్తే ఇందులో తప్పేంలేదు. కళాకారులకు పార్టీలు, ప్రాంతాలు, భాషలు ఎలాంటి అడ్డు కాదు. కాకూడదు.

ఈ విషయంలో ఉదాహరణకు .. మన తెలుగు హీరోయిన్లు, విలన్లనే తీసుకుందాం. మన హీరోయిన్లలో 90 శాతం మంది నార్త్ లేదా కేరళ నుంచి వచ్చినవాళ్లే! అలాగే విలన్లలో కనీసం 60% మంది మన తెలుగువాళ్లు కాదు. మన హీరోల్లో కొందరికి తమిళ దర్శకులంటే చాలా అభిమానం. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్లకే ఇస్తారు.

అంతదాకా ఎందుకు, మన వర్మ వెళ్లి బాలీవుడ్‌లో ఒక ప్యారలల్ ఇండస్ట్రీని నడిపిస్తున్నాడు! ఇలా మనం ఎన్నయినా చెప్పుకోవచ్చు ..

కళకూ, కళాకారులకూ ఎలాంటి ఎల్లలు లేవు. ఉండవు. ఒక రకంగా మనమంతా "ఫ్రీ బర్డ్స్" అన్నమాట!

కట్ టూ మన మోడీజీ -

2014 లో మోడీ ప్రధాని అవుతారని చాలామంది నమ్మకం. వ్యక్తిగతంగా నేనూ అదే ఫీలవుతాను. కానీ ఎలాంటి పొత్తులు లేకుండా బిజెపి ఒక్కటే స్వీప్ చేయగలిగితేనే ఏదయినా ప్రయోజనం, ఫలితం ఉంటుంది. లేదంటే అంతే సంగతులు. షరా మామూలే!

అసలు పాయింట్ ఏంటంటే - పొత్తుల విషయం ఎలా ఉన్నా, స్వయంగా వాళ్ల పార్టీలోనే మోడీ పీఎం కావొద్దు అని నానా గొడవ చేస్తున్నవాళ్లు బోలెడంతమంది ఉన్నారు. ఇవన్నీ దాటుకొని మోడీ 2014 లో పీ ఎం అయితేనే బాగుంటుంది అని నేననుకుంటాను. అందరూ అలా అనుకోవాలని రూలేమీ లేదు.

ఇది నేను పార్టీ మీద ప్రేమతో చెబుతున్నది మాత్రం కాదు. దేశం మీద ప్రేమతో.

ఇక క్లయిమాక్సుకు వద్దాం -

బాలకృష్ణ, యావత్తు మోహన్ బాబు కుటుంబం, మురళీమోహన్, సుమన్, జగపతి బాబు, నటి గౌతమి, ప్రొడ్యూసర్లు రామా నాయుడు, సురేశ్ బాబు, ఏ ఎం రత్నం, దిల్ రాజు, అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు, కీరవాణి మొదలైన అతిరథమహారథులయిన వాళ్లెందరో వెళ్లి నిన్న హైదరాబాద్ వచ్చిన మోడీజీని కలిశారు. పుష్పగుచ్చాలు, శాలువాలు మామూలే.

ఈ విషయంలో నేను హాప్పీగా ఫీలవుతున్నదేంటంటే - ఇంతకు ముందువరకూ కేవలం మన రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సీ ఎం లను మాత్రమే ఇలా కలిసేవారు మన వాళ్లు. ఇప్పుడా ఆనవాయితీ, "కాబోయే పీ ఎం" రేంజికి వెళ్లటం అనేది ఖచ్చితంగా గొప్ప విషయమే. వాళ్ల ఆత్మవిశ్వాసానికి నా హాట్సాఫ్!

అక్కడ మన వాళ్లు ఏం చర్చించారు, దేనికోసం కర్చీఫ్ వేసే ప్రయత్నం చేశారు అన్నది ఇప్పుడంత అవసరం కాదు. కాబోయే మన దేశ ప్రధాని మోడీ అని ఆయన మీద ఎంతో నమ్మకంతో వెళ్లి కలిశారు. ఆ ఒక్క పాయింటే నేనీ పోస్ట్ రాయడానికి ప్రేరేపించింది. ఇది నిజం.   

1 comment:

  1. 2014 లో జరగబొయే సార్వత్రిక ఎన్నికల్లో మోడి అబ్యర్దిత్వాన్ని బలపరచాలని 80 శాతం యువతరం కోరుకుంటోందని ఒక అంచనా . దీనికి కారణం గుజరాత్ లో జరిగిన కళ్ళుతిరిగే అభివృద్దేనని ప్రెత్యేకించి చెప్పనవసరంలేదు . ఆంద్ర ప్రదేశ్ లో నీళ్ళులేని ఊళ్ళు ఎన్నో ఉంటే , గుజరాత్ లో హైస్పీడ్ నెట్ లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు . అలాంటి అభివృద్ది దేశవ్యాక్తంగా జరగాలనే కోరికతో , జరుగుతుందనే ఆశతో మోడీకి యువత జై అంటున్నారు . కానీ ఇక్కడ మీరు చెప్పింట్టుగా పూర్తిస్థాయి బిజేపి ప్రభుత్వం అదీ నరేంద్రమోడీ నాయకత్వం లో వస్తేనే సాద్యపడుతుందనేది సువిదితమే .

    ఇక మన టాలీవుడ్ విషయానికొస్తే మొదటిసారి , పదవిలోకి వస్తారని ఆశిస్తున్న వ్యక్తికి అభీనందనలు తెలపడం . ఆదే మోడీ పట్ల ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది . దేశస్తాయిలో రీమేకులు తగ్గి ఇండస్త్రీ గ్లోబలైజెషన్ చెందుతున్న ఈ తరుణంలో ఇదొక మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు . చూద్దం ఏంజరగబోతుందో.........!

    ReplyDelete