Saturday 7 January 2017

అమ్మ

నాలో ఏ కొంచెం మంచితనం, పాజిటివిటీ ఉన్నా అందుకు కారణం మా అమ్మ.

తన 75 ఏళ్ల జీవితంలో ఎవ్వరినీ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా పొరపాటునైనా అనలేదు మా అమ్మ. ఎవరైనా ఏదైనా అపోహతోనో, ఆవేశంతోనో ఎప్పుడైనా తనని నాలుగు మాటలు అన్నా .. మౌనంగా భరించి క్షమించిందే తప్ప, వాటిని కూడా ఎన్నడూ మనసులో పెట్టుకోలేదు.

మా అమ్మ తన అత్తామామలను వారి అంతిమ క్షణాలవరకూ కంటికిరెప్పలా చూసుకుంది. తన జీవితపర్యంతం ఎంతోమందికి ఎన్నోరకాలుగా సహాయపడింది. కానీ, మా అమ్మకు ఆ పుణ్యఫలం దక్కలేదు.

అదే విధి విచిత్రం.

రకరకాల కారణాలతో తనే అందరికీ బరువైంది అని చెప్పడానికి నేనేం సిగ్గుపడటంలేదు. అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను.

తన కోడళ్లకు ఆమె కొడుకులే తప్ప, వారి తల్లి బరువు అని తెలిసినా ఎన్నడూ బాధపడలేదు మా అమ్మ. పరిస్థితిని ఎప్పుడూ కోడళ్ళవైపునుంచి చూసే మాట్లాడేది. 'కోడళ్లని బాగా చూసుకోండి, వాళ్లను ఏమాత్రం బాధపెట్టొద్దు' అని పదే పదే చెప్పేది. మరోవైపు తన కొడుకుల్లోని ఏ చిన్న తప్పునూ ఏనాడూ మొహమాటానికైనా సమర్ధించలేదు మా అమ్మ.

తను ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడినా .. మొదటి సగం సమయం నా భార్యా పిల్లలగురించే. నా పిల్లలు ప్రేమగా పెంచుకొంటున్న మా ఇంట్లోని చిన్న కుక్కపిల్ల లక్కీ గురించే. ఆ తర్వాతే నా గురించి. నా మంచిచెడ్డల గురించి.

మొన్న 27 డిసెంబర్ మధ్యాహ్నం ఒకటిన్నరకు చివరిసారిగా నాతో ఫోన్లో మాట్లాడింది మా అమ్మ. తర్వాత కొన్ని నిమిషాల్లోనే అంతా అయిపోయింది.

మా అమ్మ ఇక లేదు.

నా కాంటాక్ట్స్‌లో ఇక ఆ నంబర్‌కు ఫోన్ చేయలేను అన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ నిజం.

రెండు రోజులుగా ఆ నంబర్‌కు నేను ఫోన్ చేయలేదు.

ఏదీ మా అమ్మ?

అమ్మకు గుర్తుగా, మా అమ్మ మొబైల్ ఫోన్ నా వెంట తెచ్చుకున్నాను.

వేళ్లమీద లెక్కించే ఒకరిద్దరికి తప్ప ఈ వార్త నేను ఎవ్వరికీ చెప్పలేకపోయాను.

మా పెద్దబ్బాయికి నానమ్మ అంటే చాలా ఇష్టం. నోరారా వాడు "నానమ్మా" అని పిలుస్తుంటే అమ్మకంటే ఎక్కువ ఆనందిచేవాణ్ణి నేనే. ఎక్కడో 700 కిలోమీటర్ల అవతలున్న వాడికి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ వార్త తెలిసి వాడు, వాడి చదువు డిస్టర్బ్ కాకూడదని నా స్వార్థం. పరీక్షలొదిలేసి వస్తాడేమోనని నా భయం.

అన్నిటినీ మించి, ఈ దుఖాన్ని నాలో నేనే మౌనంగా, తనివితీరా అనుభవించాలనుకుంటున్నాను.

అందుకే ఎక్కడా బయటపడలేదు నేను.

ఈ బ్లాగ్ ఇప్పుడయితే ఇలా రాస్తున్నా కానీ, 4వ తేదీ మధ్యాహ్నం వరకూ బహుశా దీన్ని పోస్ట్ చేయ్యలేను.

నిజంగా నాలో ఏ ఒక్క శాతం మంచితనం, మానవత్వం, సంస్కారం ఉన్నా .. అందుక్కారణం మా అమ్మే. ఇంక వందసార్లయినా, వెయ్యిసార్లయినా నాగురించి నేను గర్వంగా చెప్పుకోగలిగే  నిజం ఇదొక్కటే.

మిగిలిందంతా ఉట్టి ట్రాష్.

ఇది మా అమ్మమీద నేను రాస్తున్న ఎలిజీ కాదు.

ప్రతి పనికిరాని టాపిక్ మీదా ఏ చెత్తో రాసి పోస్ట్ చేసే నేను .. మా అమ్మ గురించి మనస్పూర్తిగా రాయలేకపోతున్నానన్న బాధ.

ఏ ఒక్కరూ లేని ఏ సముద్రపు ఒడ్డుకో దూరంగా వెళ్లి, గొంతెత్తి బిగ్గరగా "అమ్మా" అని అరవాలన్న ఆవేదన.

(29/12/2016)

2 comments:

  1. మీ అమ్మగారి జ్ఞాపకాలే మీకు ఓదార్పు! ఆవిడ తప్పక మిమ్మల్ని అర్థం చేసుకునే వుంటారు - మిమ్మల్ని ప్రేమిస్తూనే వెళ్లిపోయి వుంటారు. అమ్మ కదా!
    [This may be a small thing - but you posted a wrong date under your blog post - (29/12/2017) - which should be (29/12/2016)]

    ReplyDelete